: పెద్దనోట్ల రద్దు ప్రభావం: రూ.11 కట్నం చదివించి పెళ్లి వేడుకను చేశారు!
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో నగదు కొరత ఏర్పడి దేశంలో పెళ్లి వేడుకలు జరగడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. కనీస అవసరాలకే డబ్బు దొరక్క ఎన్నోపాట్లు పడుతున్న ప్రజలు ఇక పెళ్లి ఎలా జరిపిస్తామంటూ ఆ తంతును వాయిదా వేసుకుంటున్నారు. అయితే, కొన్ని చోట్ల అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుంటూ వార్తలకెక్కుతున్నారు. ఇటీవలే 500 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు జంటలు వార్తల్లోకి ఎక్కారు. తాజాగా గ్రేటర్ నోయిడాకు చెందిన మహవీర్ సింగ్, గ్యానో దంపతుల కుమార్తె సంజు వివాహానికి ముహూర్తం దగ్గరపడింది. అయితే, పెద్దనోట్ల రద్దుతో పెళ్లివేడుకలు ఎలా జరపాలంటూ వధూవరుల కుటుంబసభ్యులు ఆవేదన చెందారు.
చివరకు ఎలాంటి ఖర్చు లేకుండా నిరాడంబరంగా సంజుని పెళ్లి చేసుకోవడానికి వరుడు అంగీకరించాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఈ పెళ్లికి సహకరించి వీరి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు. వీరి పెళ్లికి వచ్చిన పెద్దలు వరుడికి రూ.11 మాత్రమే కట్నంగా చదివించి పెళ్లి వేడుకను జరిపించారు. పెళ్లికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించి, వారికి భోజనాలు వంటివి పెట్టకుండా కేవలం టీ మాత్రమే ఇచ్చారు. దండలు మార్చుకున్న సదరు అమ్మాయి, అబ్బాయి దంపతులుగా మారిపోయారు. పెళ్లికొడుకు యోగేశ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. పెళ్లి అనంతరం పెళ్లి కూతురు సంజు తన భర్తతో కలసి అత్తగారింటికి వెళ్లిపోయింది.