: లడ్డూలు కొనండి.. ఇంటింటికీ తిరిగి పంచండి!: కార్యకర్తలకు బీజేపీ ఢిల్లీ చీఫ్ పిలుపు
ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరి నిలబడుతోన్న ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఢిల్లీ బీజేపీ వినూత్న ప్రయోగం చేయనుంది. తాజాగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ చీఫ్ తివారి మాట్లాడుతూ ప్రజలు ఎంతో సహనంతో క్యూలో నిల్చుంటారని, అటువంటి వారి కోసం తాము వచ్చేనెల 1 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఓ కార్యక్రమం చేపట్టనున్నామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టి స్వీట్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే స్థానిక బీజేపీ కార్యకర్తలు లడ్డూలు కొనాలని, ఇంటింటికీ తిరుగుతూ కుటుంబానికో లడ్డు పంపిణీ చేయాలని ఆయన కోరారు. అంతేకాదు, ఢిల్లీలోని ఏటీఎంల ముందు క్యూలో నిల్చున్న వారికి కూడా తాము టోకెన్లు ఇచ్చి లడ్డూలను పంపుతామని చెప్పారు. నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని, దేశానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంత కాలం కష్టాలు ఉంటాయని చెప్పారు.