: మంచి జరుగుతుందనే ప్రజలు ఓపికగా సహకరిస్తున్నారు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలు ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో వార్దా తుపాను వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలు, నగదు రహిత లావాదేవీలపై ఈ రోజు విజయవాడ నుంచి ముఖ్యమంత్రి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి మరింత నగదు రానుందని చెప్పారు. ఈ లోపు ఉన్న నగదును బ్యాంకర్లు సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నగదు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలంతా మంచి జరుగుతుందనే ఓపికగా సహకరిస్తున్నారని, ఈ నెలాఖరుకల్లా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలని చంద్రబాబు అన్నారు. వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చి ఈ రోజు బ్యాంకులు తెరచుకోవడంతో బ్యాంకుల ముందు రద్దీ మరింత పెరిగిందని, అందుకు తగ్గట్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరగాలని ఆయన సూచించారు.