: త్వరలో 2000 నోటు కూడా రద్దు!: ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త
2000 రూపాయల నోటు త్వరలో రద్దు కానుందంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్.గురుమూర్తి చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ రద్దు రానున్న ఐదేళ్లలో ఎప్పుడైనా జరగవచ్చని తెలిపారు. ఏ క్షణంలో అయినా రద్దు చేసేందుకే రెండు వేల రూపాయల నోటును వినియోగంలోకి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. దానిని రద్దు చేసిన తరువాత దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చలామణిలో ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా, వచ్చే జూన్ నాటికి 2000 రూపాయల నోటును చలామణి నుంచి తొలగిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో కొత్త వెయ్యి రూపాయల నోట్లు కూడా వినియోగంలోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని నోట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.