: బీఎండబ్ల్యూ కారు వద్దంటున్న సరస్వతీ పుత్రుడి తల్లిదండ్రులు
తన ప్రతిభకు మెచ్చి వచ్చిన బహుమతిని భరించే స్తోమత తమకు లేదని, ఆ డబ్బులిచ్చినా, లేదా కంప్యూటర్ లాంటి సాధనమేదైనా ఇచ్చినా చాలని చెబుతున్న ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఈ ఏడాది ఐఐటీ ఎంట్రన్స్ లో రాజస్థాన్ కు చెందిన తన్మయ్ షెకావత్ 11వ ర్యాంకు సాధించాడు. దీంతో అతనికి కోచింగ్ ఇచ్చిన సంస్థ 28 లక్షల రూపాయల బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చింది. బహుమతి తీసుకున్నప్పుడు హర్షం వ్యక్తం చేసిన తన్మయ్ షెకావత్ తల్లిదండ్రులు, ఆరు నెలలు దాటిన తరువాత దాని నిర్వహణను తాము భరించలేమని పేర్కొంటూ, ఆ కారు విలువైన డబ్బు లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటివి ఇస్తే చాలని చెబుతున్నారు. దీనిపై కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ, తన్మయ్ కారణంగా తమ పేరు ప్రతిష్ఠలతో పాటు, అడ్మిషన్లు పెరిగాయని, అందుకు బహుమతిగా బీఎండబ్ల్యూ ఇచ్చామని అన్నారు. ఆ తరువాత తన్మయ్ తల్లికి కిడ్నీ సమస్య తలెత్తిందని, ఆ చికిత్స కోసం వారికి డబ్బు అవసరమని, అందుకే దీనిని అమ్మాలన్న నిర్ణయానికి వారు వచ్చారని తెలిపారు. డిసెంబర్ 15న తమ కోచింగ్ సెంటర్ వార్షికోత్సవం జరగనుందని, ఆ సందర్భంగా ఈ కారును అమ్మకానికి పెడతామని తెలిపారు. తద్వారా వచ్చిన డబ్బును తన్మయ్ కుటుంబానికి ఇస్తామని చెప్పారు.