: ఇద్దరు చిన్నారులు.. వారి డైపర్లలో 16 కిలోల బంగారం బిస్కెట్లు.. దొరికిపోయిన వైనం
ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తోన్న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా అధికారులు ఈ రోజు ఇద్దరు చిన్నారుల డైపర్ల నుంచి 16 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. ఆరుగురు సభ్యులు గల ఓ ముఠా ఈ రోజు ఉదయం 7 గంటలకు దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకి చేరుకుందని, వారితో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. పెద్దలు సహా ఆ చిన్నారులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే... చిన్నారుల డైపర్లలోంచి 16 బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని, ఈ బిస్కెట్లు ఒక్కోటి ఒక్కో కిలో బరువుంటుందని తెలిపారు. ముఠాలోని సభ్యులు చిన్నారుల డైపర్లలో బంగారం బిస్కెట్లను దాచి, చిన్నారులపై టవల్ కప్పి తీసుకెళుతుండగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.