: చెన్నయ్‌లో 24 గంటల పాటూ కొనసాగనున్న ‘అమ్మ’ క్యాంటీన్లు
తీరాన్ని తాకిన వార్దా తుపాను చెన్నయ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పెద్ద పెద్ద చెట్లు వందల సంఖ్యలో నేలకూలాయి. చెన్నయ్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈదురు గాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వాహనాలపై చెట్లు కూలాయి. తుపాను సృష్టిస్తోన్న అలజడితో చెన్నయ్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్మాణంలో వున్న ఒక బహుళ అంతస్తుల భవనం కూడా కుప్పకూలింది. తుపాను వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. మరో గంటలో వార్దా తుపాను తీరం దాటే అవకాశం ఉందని, అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల సెల్‌ఫోన్ టవర్లు విరిగిపడ్డాయి. బాధితులకు భోజనం అందించేందుకు చెన్నయ్‌లో 24 గంటల పాటూ అమ్మ క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ప్రకటించాయి.