: భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన టీటీడీ ఈవో
తిరుమలకు వచ్చేభక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని, సంబంధిత అధికారులను టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. ‘వార్ద’ తుపాన్ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనంలో సీనియర్ అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల కనుమ రహదారుల్లో ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాన్ ప్రభావం కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనుమదారుల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని, కొండచరియలు విరిగిపడితే తొలిగించేందుకు వీలుగా మోకాలి మిట్ట, అలిపిరి వద్ద రెండు జేసీబీలను అందుబాటులో ఉంచాలని టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, అటవీ విభాగాల అధికారులకు ఆయన సూచించారు.