: నాన్నతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం..భయం కూడా వేసింది: శ్రుతిహాసన్
ప్రముఖ నటుడు కమలహాసన్ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శభాష్ నాయుడు’. స్పై కామెడీ-అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కు కూతురుగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన తండ్రితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, అదే సమయంలో చాలా భయం కూడా వేసిందని చెప్పింది. ఎందుకంటే, ఈ చిత్రానికి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయనపై ఎంతో ఒత్తిడి ఉంటుందని, అదే స్థాయిలో వ్యక్తిగతంగా తనపై కూడా ఒత్తిడి ఉంటుందని చెప్పింది. ఈ చిత్రం కోసం తాను పడ్డ శ్రమకు తండ్రి కమల్ చాలా సంతోషించారని, తన కెరీర్ లో అదే గొప్ప ప్రశంస అని చెప్పింది. ఒక సన్నివేశాన్ని దర్శకుడిగా తాను అనుకున్న విధంగా రాకపోతే నానా హంగామా చేసే వ్యక్తి కమల్ కాదని, చక్కగా అర్థమయ్యేలా చెబుతారని, తాను ప్రోత్సహించబడటానికి ప్రధాన కారణం అదేనని పేర్కొంది. కాగా, హిందీ చిత్రం ‘బెహెన్ హోగీ తేరీ’ లో రాజ్ కుమార్ సరసన శ్రుతి నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లక్నోలో జరుగుతోంది.