: నేడు రజనీకాంత్ జన్మదినం: నరేంద్ర మోదీ, అమితాబ్ తదితరుల శుభాకాంక్షలు


కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగి కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ర‌జ‌నీకాంత్  పుట్టిన రోజు
నేడు. సినిమాల్లో ఆయ‌న చూపించే స్టైల్‌కు ఫిదా అయిపోని వారు ఉండ‌బోరంటే అతిశ‌యోక్తి కాదు. నిజ జీవితంలో ఎంతో నిరాడంబ‌ర జీవితాన్ని గ‌డిపే ర‌జ‌నీ ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నుంచి అభిమానుల వ‌ర‌కు పలువురు  రజనీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. త‌లైవాతో గ‌తంలో దిగిన ఫొటోలను గ‌ర్వంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని,  ఆయ‌న ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాన‌ని ప్ర‌ధాని మోదీ,  బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

 దేవుడు ర‌జనీని ఆశీర్వదించాలని, తాను ర‌జ‌నీతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకున్నాన‌ని  బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్ పేర్కొన్నాడు. ర‌జ‌నీ ఇలాగే ఏళ్ల త‌ర‌బ‌డి వినోదాన్ని పంచాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్ పేర్కొన్నాడు. అలాగే, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌,  క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా,  దర్శకురాలు, రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తో పాటు ఎంతోమంది ప్ర‌ముఖులు, ఆయ‌న అభిమానులు సోష‌ల్‌మీడియా ద్వారా ర‌జ‌నీకి విషెస్ చెబుతున్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ రజనీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.


  • Loading...

More Telugu News