: భారత్ బాటలో వెనిజులా.. పెద్దనోటు రద్దు!
మన దేశంలో అవినీతిని రూపుమాపి, నల్లధనవంతుల ఆట కట్టించే నిమిత్తం సుమారు 35 రోజుల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తాజాగా, మరో దేశంలో కూడా పెద్దనోటు రద్దయింది . స్మగ్లర్ల ఆగడాలను అరికట్టే నిమిత్తం వెనిజులాలో పెద్దనోటు 100 బొలివర్ ను రద్దు చేశారు. ఈ మేరకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడురో ఒక ప్రకటన చేశారు. రద్దయిన పెద్దనోటు స్థానంలో నాణేలను ప్రవేశపెట్టనున్నామని, ఈ ప్రక్రియ 72 గంటల్లోనే ముగుస్తుందని చెప్పారు. తమ దేశ సరిహద్దుల్లో స్మగ్లింగ్ ను, స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, దేశంలో నెలకొన్న ఆహార కొరత కూడా తీరుతుందని నికోలస్ మాడురో అభిప్రాయపడ్డారు. కాగా, పెద్దనోటు స్థానంలో నాణేలను తక్కువ సమయంలో తీసుకురావడం కుదరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వెనిజులాలో ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొని ఉంది.ఆ దేశ ద్రవ్యోల్బణ పరిస్థితి కూడా దారుణంగా ఉంది.