: జయ నా వల్లే ఓడిపోయింది... ఆమెను చాలా బాధ పెట్టా: రజనీకాంత్
దివంగత ముఖ్యమంత్రి జయలలితను తాను చాలా బాధపెట్టానని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 1996 ఎన్నికల్లో తాను చేసిన వ్యాఖ్యల వల్లే జయలలితకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలయిందని ఆయన తెలిపారు. చెన్నైలో నిన్న నిర్వహించిన జయలలిత, చో రామస్వామి సంస్మరణ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాను జయకు వ్యతిరేకంగా వ్యవహరించానన్న విషయం తనను ఇప్పటికీ కలచివేస్తోందని చెప్పారు. జయ మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడని ఆ ఎన్నికల సందర్భంగా రజనీకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంస్మరణ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ, జయను కోహినూర్ వజ్రంగా అభివర్ణించారు. ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయని చెప్పారు. పురుషాధిక్య ప్రపంచంలో ఆమె చేసిన పోరాటం అసాధారణమైనదని... అదే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చిందని అన్నారు. తనకు, జయకు మధ్య వివాదం ఉన్నప్పటికీ... తన కుమార్తె వివాహానికి ఆమె హాజరు కావడం తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి బరువెక్కిన హృదయంతో ఆమె అపాయింట్ మెంట్ కోరానని... ఆమె తనతో మాట్లాడతారని కూడా ఊహించలేదని తెలిపారు. జయ మన మధ్య లేకపోవడం తీరని లోటు అని చెప్పారు.