: పెట్రోల్ బంక్ సిబ్బందిపై కత్తులతో దాడి... లక్షలు కొల్లగొట్టిన దొంగలు
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సిబ్బందిపై నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పెట్రోల్ బంకులో ఉన్న ఆరుగురు సిబ్బందిపై రాళ్లు, కత్తులతో దాడి చేశారు. అనంతరం మేనేజర్ గదిలోకి వెళ్లి, అక్కడ ఉన్న రూ. 20 లక్షలను దోచుకుపోయారు. ఈ పని చేసింది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని భావిస్తున్నారు. గాయపడ్డ పెట్రోల్ బంక్ సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.