: నెల్లూరు సముద్ర తీర మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
‘వార్దా’ తుపాన్ నెల్లూరు జిల్లా శ్రీహరికోట-చెన్నై మధ్య తీరం దాటనున్నట్లు షార్ శాస్త్రవేత్తలు చెప్పినట్లు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడించారు. తుపాన్ ప్రభావం రేపు మధ్యాహ్నం నుంచి అధికంగా ఉండనున్న నేపథ్యంలో సముద్ర తీర మండలాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. షార్ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. జిల్లాలో సహాయక చర్యల కోసం మూడు జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేశామని, అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించామని కలెక్టరు తెలిపారు. కాగా, ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండగా, చలిగాలుల ప్రభావం పెరిగింది. తుపాన్ తీరం దాటే సమయంలో సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో ఐదు గంటల వ్యవధిలోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.