: నిజం చావకూడదనే లేఖ.. జయలలిత చికిత్స వెనక ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నాకుంది: గౌతమి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో కలత చెందిన ప్రముఖ సినీనటి గౌతమి.. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఆమె లేఖ తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ‘అమ్మ’ మరణంపై చాలామందిలో నెలకొన్న సందేహాలను ఆమె తన లేఖ ద్వారా వ్యక్తం చేయడంపై చాలామంది సంతోషించారు. అయితే ‘కొందరికి’ మాత్రం అది కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ నిజం చావకూడదనే తాను లేఖ రాసినట్టు తెలిపారు. ఆమె చికిత్స వెనక ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఓ సామాన్య పౌరురాలిగా తనకు ఉందని పేర్కొన్నారు. ఓ సామాన్య పౌరురాలిగా ఆమె చికిత్స వెనక ఏం జరిగిందో తెలుసుకునే హక్కు నాకు ఉంది. అందుకే మాట్లాడా. అటువైపు ఉన్నది ఎటువంటి వాళ్లో నేను ఆలోచించలేదు. కోట్లాదిమంది అభిమాన దేవత అయిన జయలలిత గారికి చివరి రోజుల్లో ఎటువంటి చికిత్స అందించారో తెలుసుకోవాలని వారు అనుకుంటున్నారు. నాకూ అదే అనిపించింది. నిజానికి ఆవిడ నాకు ఆదర్శం. నేను కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆవిడ స్ఫూర్తితోనే వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నా. ఇతరులకు ఆదర్శప్రాయమైన వ్యక్తి జీవితంలో సమాధానం లేని ప్రశ్నలు ఉద్భవించినప్పుడు సమాధానం ఆశించడం తప్పు కాదు. ఆమేమైనా సాదాసీదా వ్యక్తి కాదు కదా? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆవిడ మరణం మిస్టరీగా మిగిలిపోకూడదనే లేఖ రాశా. జయ మరణంపై నిజాలు తెలుసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో కోరా. అంతేకానీ ఎవరినో అనుమానించి నేనీ లేఖ రాయలేదు. ఆస్పత్రిలో ఉన్న జయలలితను పరామర్శించేందుకు వెళ్లినవారిని లోపలికి అనుమతించనంత రహస్యం ఎందుకో ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం. ఆస్పత్రి నుంచి ఇదిగో వస్తారు, అదిగో వస్తారు అంటుంటే వస్తారులే అనుకున్నా. కానీ అంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. జయ ఇక లేరన్న వార్తతో షాక్‌కు గురయ్యా. ఆవిడ ఐసీయూలోనూ లేరు, పరిస్థితి విషమంగా ఉందనీ చెప్పలేదు. సడెన్‌గా గుండెపోటు వచ్చిందని చెప్పి, ఆ తర్వాత మరణవార్త ఏంటి? ఇదే నా ప్రశ్న. ఇంటర్వ్యూలో గౌతమి తన వ్యక్తిగత జీవితంపైనా మాట్లాడారు. భవిష్యత్తులో క్యాస్టూమ్స్ డిజైనర్‌గా పనిచేయాలనుకుంటున్నానని, సినిమాలు, సీరియళ్లలో నటిస్తానని స్పష్టం చేశారు.