: ప్రపంచానికి పాత పాఠం కొత్తగా చెబుతున్న బార్బర్... సోషల్ మీడియాలో వైరల్


చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌ లో జియావోజువో అనే గ్రామానికి చెందిన వాంగ్ జెంగ్‌ జియాన్ అనే బార్బర్ పాత పాఠాలను సరికొత్తగా నేర్పుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆయన తన బార్బర్ షాపులో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిర్విరామంగా పని చేస్తుంటారు. గ్రామం పెద్దదా అంటే అదీ కాదు. అయితే ఆయన అలా పని చేయడానికి కారణం ఏంటటే... ఆయన కటింగ్ చేసిన తరువాత తీసుకునే రుసుము భారతీయ కరెన్సీలో పది రూపాయలే... ఈ ధర కూడా పాతికేళ్ల క్రితం ఫిక్స్ చేసింది. అప్పటి నుంచి ధరలు పెరిగినా, సమస్యలు వచ్చినా ఆయన రుసుం ధరమాత్రం పెంచలేదు. అంతేకాదు, షాపు పెట్టిన నాటి నుంచి ఆయన విలువలు కూడా మారలేదు. అప్పటి నుంచి ఆయన పేదలు, దివ్యాంగులకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తున్నారు. అంతేకాదు, షాపుకొచ్చి కూర్చోగలిగిన వారికి కుర్చీలో, అలా కూర్చోలేని వారికి చెట్టు కింద నీడలో, అసలు షాపుకే రాలేనివారికి ఇంటికెళ్లి మరీ కటింగ్ చేస్తుంటారు. ఇది ఆసక్తికరంగా ఉండడంతో మీడియా ఆ ఊర్లోని వారిని వాంగ్ గురించి అడగగా, ఒక వ్యక్తి మాట్లాడుతూ, తాను గతంలో వాంగ్ షాపుకెళ్లి కటింగ్, షేవింగ్ చేయించుకునే వాడినని తెలిపారు. గత కొంతకాలంగా తాను అనారోగ్యం వల్ల మంచం పట్టానని, ఇప్పుడు లేవలేకపోతుండడంతో వాంగ్ రెగ్యులర్‌ గా తన ఇంటికొచ్చి హెయిర్ కటింగ్, షేవింగ్ చేసి వెళుతున్నారన్నారు. కటింగ్, షేవింగ్ చేసిన తరువాత తన నుంచి డబ్బులు కూడా తీసుకోవడం లేదని అన్నారు. పది రూపాయలే కదా! అవి ఇద్దామనుకుంటే, వాంగ్ మాట్లాడుతూ, 'బాబాయ్! డబ్బులెవరికి కావాలి, ప్రేమకావాలిగానీ' అంటూ ఆప్యాయంగా రెండు మాటలు చెప్పి వెళ్తారని 80 ఏళ్ల వ్యక్తి తెలిపారు. దీనిపై వాంగ్ ను అడగగా.... తమ గ్రామం ధనిక గ్రామమేమీ కాదని, తమ గ్రామంలో అందరూ ఒకే స్థాయి వాళ్లు ఉండరని అన్నారు. తమ గ్రామంలో పేదవాళ్లతో పాటు, డబ్బులున్నవాళ్లు కూడా ఉన్నారని అన్నారు. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన బతుకుతెరువుకు సరిపడినంతా చార్జిచేస్తే చాలని తెలిపారు. వృత్తిలో కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదని అన్నారు. చిత్తశుద్ధి ముఖ్యమని అన్నారు. తనకు క్షవరం నేర్పిన గురువు ఏం చెప్పారో తాను దానినే అచరిస్తున్నానని అన్నారు. దీంతో ఆయన సోషల్ మీడియా హీరో అయిపోయారు. మానవత్వాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News