: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా ఆధిక్యం 51 పరుగులు!
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 51 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులు సాధించగా, దానికి దీటుగా టీమిండియా బ్యాట్స్ మన్ ఆడారు. ప్రధానంగా మురళీ విజయ్ (136), కెప్టెన్ విరాట్ కోహ్లీ (147) అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ సెంచరీలతో రాణించడంతో టీమిండియా ఇంగ్లండ్ జట్టుకు దీటైన సమాధానం చెప్పింది. ఇంగ్లిష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఈ క్రమంలో కోహ్లీకి మురళీ విజయ్, రవీంద్ర జడేజా (25), జయంత్ యాదవ్ 30 నాటౌట్ నుంచి అద్భుతమైన సహకారం లభించింది. దీంతో 142 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 451 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉండగా, రేపు ఆట టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు కీలకంగా మారనుంది. పిచ్ టర్న్ అవుతుండడంతో రెండు జట్లకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు కూడా అవకాశం ఉంది.