: చేతిలో డబ్బు లేకపోవడంతో రెస్టారెంట్లో భోజనం చేసి పారిపోయిన విదేశీ పర్యాటకుడు!
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత దేశంలోని ప్రజలే కాకుండా భారత్ టూర్‌కి వచ్చిన విదేశీయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేరళలోని మున్నార్ ప్రాంతానికి వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు తన చేతిలో డబ్బులు లేకపోయినా, హాయిగా రెస్టారెంట్లో భోజనం చేశాడు. ఆ రెస్టారెంటు యజమాని ఈ విషయం గురించి మాట్లాడుతూ... తాను 1989 నుంచి ఈ రెస్టారెంటుని నడిపిస్తున్నానని, తమ వద్దకు విదేశీయుడు వచ్చి తన వద్ద డబ్బులు లేవని, క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పాడని, అయితే తమ వద్ద స్వైపింగ్ మిషన్ లేదని చెప్పామని అన్నాడు. అయితే, ఆ విదేశీయుడు వెళ్లిపోకుండా తమ హోటల్‌లో భోజనం తిని అనంతరం బిల్లు కట్టకుండా పారిపోయాడని అన్నారు. అయితే, తమ రెస్టారెంటు సిబ్బంది అతడిని వెంటాడి పట్టుకున్నారని, తన వద్ద డబ్బు లేకపోవడం వల్లే భోజనం చేసి పారిపోయానని చెప్పాడని తెలిపారు. ఏటీఎంల వద్ద కూడా తనకు డబ్బు దొరకలేదని తమకు చెప్పాడని అన్నారు. ఆకలిగా ఉండటం వల్లే ఆ విదేశీయుడు ఇలా చేశాడని పేర్కొన్నారు. దీంతో అతడిని వదిలేసినట్లు చెప్పారు. అతడే కాకుండా మరికొంత మంది విదేశీ పర్యాటకులు కూడా తమ వద్ద ఇలాగే చేశారని చెప్పారు. ఇటీవలే ఫ్రాన్సు నుంచి వచ్చిన 8 మంది కూడా తమ వద్దకు వచ్చి డబ్బులు లేవని చెప్పారని, అయితే తర్వాత ఉన్నప్పుడు ఇవ్వమని చెప్పి వారికి ఉచితంగా అన్నం పెట్టామని చెప్పారు. కొన్ని రోజుల అనంతరం కొందరు డబ్బులు చెల్లిస్తే కొందరు చెల్లించలేదని చెప్పారు.