: ఆయుధాల అమ్మకాల్లో వెనకబడిపోతున్న అమెరికా.. స్పీడు పెంచిన రష్యా!
వరుసగా ఐదో సంవత్సరంలో కూడా ప్రపంచంలో అమెరికా ఆయధాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఆయుధాల అమ్మకాల్లో అమెరికా గతంలో కనబర్చిన దూకుడును ఇప్పుడు చూపించలేకపోతోంది. అమెరికా స్థానంలో యూరప్ దేశాలు మాత్రం ఇదే రంగంలో తమ మార్కెట్లను పెంచుకుంటూ వెళుతున్నాయి. ఆయుధాల విక్రయాలు గతంలో కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మిగతా దేశాలతో పోలిస్తే కనుక అత్యధిక ఆయుధాలను ఎగుమతి చేస్తోన్న అమెరికానే ఇప్పటికీ తొలిస్థానంలో ఉంది. ఈ అమ్మకాల్లో అమెరికా వాటా 54 శాతంగా ఉంది. గత ఐదేళ్లుగా అమెరికాలో ఆయుధాల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణంపై స్టాక్హోమ్ లోని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ వ్యాఖ్యానిస్తూ.. అమెరికా తమ దేశ రక్షణ కేటాయింపులపై పరిమితులు విధించడమే ఇందుకు కారణమని చెప్పింది. 2014వ సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది ఆ దేశ ఆయుధాల అమ్మకాలు మూడు శాతం తగ్గాయని పేర్కొంది. ఇదే సమయంలో రష్యా ఆయుధాల అమ్మకాలు 6.2 శాతం మేరకు అధికమయ్యాయి. ఇక 2014లో రష్యా ఆయుధాల అమ్మకాల్లో 48 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా, 2013లో 20 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో ఆ దేశ వాటా ఇప్పటికీ 8.1 శాతం మాత్రమే ఉంది. తమ దేశంలో ఈ ఉత్పత్తుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకోసం వాటిపై పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. 2025 సంవత్సరం నాటికల్లా రక్షణ రంగ ఉత్పత్తులపై పెట్టుబడులను 70,000 కోట్ల డాలర్లకు పెంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక గత ఏడాది అమెరికా విక్రయించిన ఆయుధాల విలువ 20,900 కోట్ల డాలర్లుగా నమోదయింది. ఈ రంగంలో అమెరికాను వెనక్కునెట్టడమే పుతిన్ లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఫ్రెంచ్ రక్షణ సంస్థలు ఆయధాల విక్రయాలను పెంచుకుంటూ వెళుతున్నాయి. 2014తో పోల్చి చూస్తే గత ఏడాది ఫ్రెంచ్ రక్షణ ఉత్పత్తుల కంపెనీలు తమ అమ్మకాలను 13 శాతం పెంచుకున్నాయి. ఫ్రెంచ్ కంపెనీలు అధికంగా ఈజిప్టు, ఖతార్, జర్మనీ కంపెనీలకు తమ ఆయుధాలను విక్రయించాయి. దీంతో ఆయా కంపెనీలు సుమారు 7 శాతం అమ్మకాలను పెంచుకున్నాయి. అదే సమయంలో బ్రిటీష్ కంపెనీలు తమ ఆయుధ విక్రయాలను 2.8 శాతం పెంచుకున్నాయి. దక్షిణ కొరియా కూడా ఈ విక్రయాల్లో గత ఏడాది 32 శాతం వృద్ధిని సాధించింది. అయితే, దక్షిణ కొరియా విక్రయిస్తోన్న ఆయుధాల్లో అత్యధిక వాటాను తమ దేశ సైన్యమే విక్రయించింది. మరోవైపు చైనాకు సంబంధించిన ఈ వివరాల గురించి మాత్రం సమాచారం లేదు.