: రూ.72 లక్షల కొత్త నోట్లను తీసుకొస్తున్న వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు
పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అరెస్టులు చేస్తోన్నా కొందరు బ్యాంకు అధికారులు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ఓ వైపు బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తోంటే, మరో వైపు నల్లకుబేరుల వద్దకు మాత్రం కొత్త నోట్ల కట్టలు భారీగా వచ్చిపడుతున్నాయి. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొత్తూరులో తనిఖీలు చేస్తోన్న పోలీసులకి పెద్ద ఎత్తున కొత్తనోట్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన నగదులో రూ.72 లక్షల మేర కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాక, మరో 10 లక్షల రూపాయలు పాతనోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నగదు మార్చుకుని వస్తుండగా తాము పట్టుకున్నట్లు కొత్తూరు పోలీసులు తెలిపారు. నిందితులు ఆ నగదును ఎక్కడ మార్చుకున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు.