: బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు: మోదీ
పేదల వికాసం కోసమే తమ ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో ఈ రోజు నిర్వహించిన ఓ సభలో మోదీ పాల్గొని పెద్దనోట్ల రద్దుపై మాట్లాడారు. దేశాన్ని పట్టిపీడిస్తోన్న నల్లధనాన్ని నియంత్రించడానికే తాము పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బ్యాంకులనే మీ మొబైల్ ఫోన్లలోకి తీసుకొచ్చారని చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జరపాలని పిలుపునిచ్చారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని అన్నారు.