: రష్యా కల్పించుకోబట్టి ట్రంప్ గెలిచారు: సీఐఏ అధికారి సంచలన వ్యాఖ్య
వైట్ హౌస్ లో ప్రవేశం కోసం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం వెనుక రష్యా హస్తముందని సీఐఏ సంచలన ప్రకటన చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచేలా చూడటమే లక్ష్యంగా రష్యా పని చేసిందని, సీఐఏ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హిల్లరీకి చెందిన వేల కొద్దీ ఈమెయిల్స్ హ్యాక్ చేయడం, వాటిని బహిర్గతం చేయడం నుంచి హిల్లరీ అవకాశాలను దెబ్బతీసే ప్రతి వార్త వెనుకా రష్యా ప్రభుత్వం, రష్యా మద్దతుతో పనిచేసిన వికీలీక్స్ హస్తముందని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు గుర్తించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. "రష్యా లక్ష్యం ట్రంప్ ను గెలిపించడమే. ఈ మేరకు రష్యా కృషి ఫలించింది. నిఘా వర్గాలు ఈ విషయంలో సాక్ష్యాలు సంపాదించాయి. ఇది ప్రమాదకరం" అని సీఐఏ అధికారి ఒకరు యూఎస్ సెనెటర్ల ముందు వెల్లడించారు. కాగా, నవంబర్ మొదట్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగా, హిల్లరీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.