: పద్మాదేవేందర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం... పరామర్శించిన కేసీఆర్, హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పగా, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు ఆమెను ఫోన్ లో పరామర్శించారు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో జరిగింది. చేగుంటలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఆమె కారులో బయలుదేరగా, మనోహరాబాద్ లోని ప్రధాన చౌరస్తాకు సమీపంలో నేషనల్ హైవేపై ఓ ఆటో యూ టర్న్ తీసుకుంటూ, వేగంగా వెళ్లి డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్ కు అడ్డంగా వచ్చింది. ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి కారు, దాని వెనకున్న మరో కారు బలంగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆపై మరో వాహనంలో ఆమె వివాహానికి వెళ్లిపోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ ను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.