: ఆచితూచి అడుగేస్తున్న శశికళ... కుటుంబసభ్యులకు పార్టీలో నో బెర్త్
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్న జయలలిత నెచ్చెలి శశికళ... ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా పని కానిచ్చేయాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన కుటుంబసభ్యులను కూడా దూరం పెట్టారు. పోయస్ గార్డెన్స్ లోనే నివాసం ఉంటున్న ఆమెతో పాటే కుటుంబసభ్యులంతా ఉన్నారు. పోయెస్ గార్డెన్ లోనే తన బంధువులందరితో ఆమె సమావేశం నిర్వహించి, తన మనసులోని మాట చెప్పారట. ఆ తర్వాత వారంతా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె వదిన ఇళవరసి మాత్రమే ఆమెతో పాటు ఉన్నారు. అంతేకాదు, తన బంధువులు ఎవరు ఏమి చెప్పినా పట్టించుకోవద్దని పార్టీ కీలక నేతలు, మంత్రులకు శశి స్పష్టం చేశారు. జయలలిత భౌతికకాయాన్ని రాజాజీ హాల్లో ఉంచినప్పుడు శశి బంధువులంతా... జయ పార్థివదేహం చుట్టూనే ఉన్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 2011లో శశికళ సహా ఆమె కుటుంబసభ్యులందరినీ పార్టీ నుంచి జయ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నాలుగు నెలలకు శశికళను దగ్గరకు రానిచ్చినా... ఆమె కుటుంబసభ్యులను మాత్రం తన నివాసంలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు మళ్లీ వారంతా పార్టీలో హల్ చల్ చేసే ప్రయత్నం చేస్తే... ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని శశి భావిస్తున్నారు. అందుకే, తన కుటుంబసభ్యులకు పార్టీలో నో బెర్త్ అనే నిర్ణయం తీసుకున్నారు.