: ప్రజల అసహనం... బ్యాంకులపై పెరుగుతున్న దాడులు!


నోట్ల రద్దు జరిగిపోయి నెల రోజులు దాటింది. నవంబర్ 8న ప్రధాని రెండు రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రకటించారు. రెండు రోజులన్నది రెండు వారాలైనా పరిస్థితి మారలేదు. రెండు వారాలు కాస్తా రెండు పక్షాలు దాటింది. అయినా బ్యాంకుల్లో క్యూలైన్లు తగ్గలేదు, ఏటీఎంలలో క్యాష్ చేరలేదు. ఈ నేపథ్యంలో మొన్నటి ఒకటో తారీఖు తరువాత ప్రజల్లో అసహనం పెరిగినట్టు దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఖాతాలో డబ్బున్నా చేతికి రాని పరిస్థితి, రూ. 2 వేలు లేదా రూ. 4 వేల కోసం ఒక రోజు ఉద్యోగాలకు సెలవు పెట్టాల్సి రావడం వంటి పరిస్థితి పట్ల, ప్రజలు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో డబ్బు లేదన్న సమాధానం వస్తే, వారిలో కోపం కట్టలు తెంచుకుంటుండగా, బ్యాంకులపై దాడులకు దిగుతున్నారు. నిన్న హైదరాబాదు, రాజేంద్ర నగర్ ఆంధ్రాబ్యాంకు అధికారులు నగదు లేదని చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎన్ఐఆర్డీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి. ఖాతాదారుల ఆందోళనను చిత్రీకరించిన బ్యాంకు మేనేజర్ పై కస్టమర్లు దాడి చేసినంత పని చేశారు. ఇక ఉత్తరాదిన యూపీ, బీహార్ లలో బ్యాంకుల అద్దాలు పగులగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నగదు లభ్యత మరింత ఘోరంగా ఉంది. బ్యాంకులకు నగదు రావడం ఇలాగే ఆలస్యమవుతుంటే, ప్రజల్లో మరింత అసహనం పెరిగి బ్యాంకులపై దాడుల ఘటనలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News