: నవంబరు 8 నుంచి నేటి వరకు వెయ్యి శాతం డిజిటల్ లావాదేవీలు... కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్


పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నవంబరు 8వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు దేశంలో 400 నుంచి వెయ్యి శాతం వరకు డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘డిజిశాల’, ‘క్యాష్‌లెస్ ఇండియా’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దూరదర్శన్ డీటీహెచ్ ప్లాట్‌ఫామ్‌పై ‘డిజిశాల’ చానల్ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రెండుకోట్ల మందికిపైగా ప్రజలు దూరదర్శన్‌ ప్లాట్‌ఫాంను వినియోగిస్తున్నారన్నారు. సాంకేతికత పెరిగిందని చెప్పడానికి డిజిటల్ లావాదేవీలే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ప్రజల్లో మరింత అవగాహన పెంచితే ఆన్‌లైన్ లావాదేవీలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ-వాలెట్ల లావాదేవీలు రోజుకు 17 లక్షల నుంచి 63 లక్షలకు పెరిగాయని, వీటి విలువ రూ.191 కోట్లు అని వివరించారు. అలాగే రూపే కార్డుల లావాదేవీల సంఖ్య కూడా పెరిగిందన్నారు. రోజుకు రూ.236 కోట్ల లావాదేవీలకు ఇది చేరుకుందని తెలిపారు. యూపీఐ లావాదేవీలు రోజుకు రూ.1.93 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెరిగినట్టు మంత్రి వివరించారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా అవినీతి, నల్లధనం తగ్గుముఖం పడతాయని ఐటీ శాఖ సహాయమంత్రి పీపీ చౌదరి అన్నారు.

  • Loading...

More Telugu News