: భవనం కూలిన ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య.. కేరళలో బిల్డర్ అరెస్ట్
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గురువారం రాత్రి ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. ఇద్దరు కూలీలు ప్రాణాలతో బయటపడ్డారు. గురువారం రాత్రి నుంచి నిరాటంకంగా కొనసాగిన సహాయక చర్యలు ముగిశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బిల్డర్‌ను కేరళలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణకు కమిటీ వేసినట్టు వివరించారు.