: భవనం కూలిన ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్ శివారులోని నానక్ రాంగూడలో నిన్న రాత్రి కుప్పకూలిన ఏడంతస్తుల భవనాన్ని టీపీసీసీ నేత షబ్బీర్ అలీతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపుదిద్దుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఆచరణలో మాత్రం ఆ దిశగా పనులు కొనసాగడం లేదని ఆయన అన్నారు. కాగా, ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.