: ఈ ఏడాది యూట్యూబ్ లో దుమ్ము దులిపిన రజనీకాంత్ ‘కబాలి’ ట్రైలర్

స్టైలుకే స్టైలు నేర్పిస్తాడని అభిమానులు ఎంతగానో కొనియాడే సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేసింది. 2016 లో యూట్యూబ్‌లో ఇది టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా యూట్యూబ్ ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేసింది. ఈ ఏడాది టాప్ 10 ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, బాలీవుడ్ ట్రైలర్ల జాబితాల గురించి తెలిపింది. అందులోనే కబాలి హవా కొనసాగినట్లు చెప్పింది. టాప్ ట్రెండింగ్ ట్రైలర్‌గా కబాలి ఉండగా, హిందీలో ప్రసారమవుతున్న కపిల్‌శర్మ షోకు సల్మాన్ ఖాన్ అతిథిగా వెళ్లిన ఎపిసోడ్ టాప్ ట్రెండింగ్ వీడియోగా ఉంది. ఆర్‌బీఐ కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటుకి జీపీఎస్ చిప్ ఉంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై యూట్యూబ్‌లో పెట్టిన వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది యూట్యూబ్‌లో సంగీతం అంశాన్ని పరిశీలిస్తే సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ నటించిన ‘కాలా చష్మా’ వీడియో 45 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉంది. ఈ ఏడాది టాప్ 10 గా నిలిచిన ఈ వీడియోలన్నింటినీ కలిపిచూస్తే మొత్తం కలిపి 70 మిలియన్ల మంది చూశారని, వీటి వల్ల తమ యూట్యూబ్ ఛానెల్‌ను 45 మిలియన్ల మంది కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని యూట్యూబ్ అధికారులు ప్రకటించారు.