: నా ఇల్లు పోయినా ఫర్వాలేదు.. ‘ప్లాన్’ మాత్రం మార్చకండి: ఆదర్శంగా నిలిచిన కేరళ మంత్రి
ప్రజల కోసం, తమ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత మంది మంత్రులు నిజంగా పాటుపడుతున్నారో వారికే తెలుసు. కానీ, ఒక విషయమై కేరళ మంత్రి సుధాకరన్ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే, ఆయన్ని ప్రజల మంత్రి, ఆదర్శనీయమైన మంత్రి అని అనకతప్పదు. కేరళలోని కాజకూట్టం-చేర్టాల మధ్య జాతీయ రహదారిని ఇటీవల వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఈ పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. అయితే, అలప్పుజలో తూక్కుకుళం వద్ద ఈ పనులు నిర్వహించాలంటే సదరు అధికారులు కొంచెం జంకారు. ఎందుకంటే, ఆ రాష్ట్ర మంత్రి సుధాకరన్ కు సంబంధించిన ఇల్లు అక్కడే ఉంది. రోడ్డు విస్తరణ పనుల్లో ఆయన ఇల్లు ధ్వంసమవుతుందని చెప్పి, ప్లాన్ ను మార్చుకోవాలనుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న సుధాకరన్ మాత్రం సానుకూలంగా స్పందించారు. ‘రోడ్డు విస్తరణ పనుల్లో నా ఇల్లు పోయినా ఫర్వాలేదు. ప్లాన్ మాత్రం మార్చకండి’ అని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. తన ఇల్లు పోతుందని చెప్పి.. రోడ్డు విస్తరణ పనుల ప్లాన్ మార్చితే కనుక, రోడ్డు అవతలి వైపు ఉండే వ్యక్తి నష్టపోతాడని, తన భూమిని కోల్పోతాడని సదరు మంత్రి చెప్పడం విశేషం. అందుకే, తన ఇల్లు పోయినా ఫర్వాలేదు కానీ, ప్లాన్ మాత్రం మార్చవద్దని అధికారులకు సూచించి ఆ మంత్రి ఆదర్శంగా నిలిచారు.