: 24 గంటల్లో రెండు సార్లు శశికళను కలిసిన పన్నీర్ సెల్వం
దివంగత ముఖ్యమంత్రి జయలలితకే కాదు, ఆమె నెచ్చెలి శశికళకు కూడా విధేయుడిగా మారినట్టున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఈ రోజు కూడా పోయస్ గార్డెన్ కు వెళ్లి శశికళను కలిశారు పన్నీర్. గత 24 గంటల్లో ఆమెను పన్నీర్ కలవడం ఇది రెండోసారి. పలువురు సీనియర్ మంత్రులను వెంటేసుకుపోయిన ఆయన ... శశికళతో మంతనాలు జరిపారు. అయితే భేటీలో ఏం చర్చించారన్న విషయాలు విస్పష్టంగా తెలియనప్పటికీ... అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ తేదీ ఖరారు, 2017 ఫిబ్రవరి 24న జయ జయంతి నిర్వహణ తదితర విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జయ మరణించిన తర్వాత కూడా అధికారానికి కేంద్ర బిందువుగా పోయస్ గార్డెనే ఉంది. గత 40 ఏళ్లుగా జయ నివసించిన ఇంట్లో ఇప్పుడు శశికళ, ఆమె బంధువులు ఉంటున్నారు.