: వారెవ్వా... పాత 500 నోటుతో కరెంట్ పుట్టించాడు!
పెద్ద నోట్లు రద్దయిన తర్వాత జనాలు ఎన్నో చిత్ర విచిత్రాలు చేశారు. పాత నోట్లకు దండేయడం, 'రిప్' అంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్ట్ చేయడం, పొట్లం కట్టి వాటిలో పల్లీలు, పకోడీలు వేయడం వంటి చిత్రాలు చూశాం. అంతేకాదు, కొత్తగా వచ్చిన నోట్లను రకరకాలుగా పరీక్షిస్తూ, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఎవరికీ రాని ఆలోచన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థికి వచ్చింది. ఒడిశాకు చెందిన సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లచ్మన్ దుండి కొంచెం వెరైటీగా ట్రై చేసి అద్భుతాన్ని సృష్టించాడు. పాత 500 నోటుతో కరెంట్ నే పుట్టించాడు. ఆ కరెంట్ తో బల్బును వెలిగించి 'ఔరా' అనిపించాడు. ఈ సందర్భంగా లచ్మన్ మాట్లాడుతూ, రూ. 500 నోటుపై సూర్యకాంతి కానీ, ఏదైనా వెలుతురు కానీ పడితే... దానిపై ఉన్న సిలికాన్ మెటీరియల్ వల్ల ఉష్ణం పుడుతుందని, దాని నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపాడు. ఈ విద్యార్థి చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కొంచెం ప్రోత్సాహం అందిస్తే, మరిన్ని అద్భుతాలు సాధించగలడని చెబుతున్నారు.