: చంద్ర‌బాబు మనసు మారకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం!: వైఎస్ జ‌గ‌న్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా ఈ రోజు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఏపీలో క‌లెక్ట‌రేట్ల ముందు ధ‌ర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ స‌రిగా అంద‌డం లేద‌ని ప్రతి పేదవాడు రాష్ట్ర ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నాడ‌ని ఆయ‌న అన్నారు. పేదవాడు రెండు కార‌ణాల వ‌ల్ల అప్పుల పాలు అవుతాడ‌ని అవి అనారోగ్యం, పిల్లల చదువేన‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని దివంగ‌త వైఎస్ఆర్ ఎప్పుడూ చెబుతూనే ఉండేవార‌ని ఆయ‌న అన్నారు. వైఎస్ఆర్ కంటే ముందు రాష్ట్రాన్ని పాలించిన వారు పేదల మీద, బీసీల మీద ఎంతో ప్రేమ‌ ఉందని చెప్పుకునే వారని, కానీ, వారికి ఏం కావాలో తెలుసుకున్న నాయ‌కుడు వైఎస్ఆరేన‌ని అన్నారు. వైఎస్ఆర్ కంటే ముందు పాలించిన నాయ‌కులు వారికి ఇస్త్రీ పెట్టెలు ఇస్తే, క్షవరం చేసుకోడానికి కత్తెరలు ఇస్తే సరిపోతుందని భావించేవార‌ని, కానీ, వైఎస్ఆర్ అలా ఆలోచించ‌లేద‌ని ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుతో ఇంజనీరింగ్, వైద్యవిద్యను అందించార‌ని జగన్ చెప్పారు. అటువంటి నాయ‌కుడు ప్రవేశపెట్టిందే ఆరోగ్యశ్రీ పథకమ‌ని, ఇప్పుడు దాన్ని కూడా ప‌ట్టించుకున్న పాపాన రాష్ట్ర ప్ర‌భుత్వం లేద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న పాల‌న‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో పది అంబులెన్సులు ఉండేవ‌ని, వాటిలో ఏడు పడుకున్నాయని, మూడు మాత్ర‌మే పనిచేస్తున్నాయని విమ‌ర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించగానే ఆరోగ్యమిత్రలను పూర్తిగా ఉద్యోగాల నుంచి తీసేశారని ఇక పేద‌ల‌కు మంచి వైద్యం ఎలా అందుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జాబు రావాలంటే బాబు సీఎం కావాలని ప్ర‌చారం చేసుకున్నార‌ని, ఇప్పుడు ఉన్న జాబుల‌నే తీసేస్తున్నార‌ని జగన్ విమ‌ర్శించారు. ఆరోగ్యశ్రీ ప‌థ‌కం కొన‌సాగించ‌డానికి 910 కోట్ల రూపాయలు ఈ ఏడాదికి ఖర్చవుతుందని ఆరోగ్య శాఖ స‌ర్కారుకి చెబితే, ప్ర‌భుత్వం మాత్రం కేవలం 565 కోట్ల రూపాయలే కేటాయించిందని ఆయ‌న అన్నారు. పేద‌ల త‌రువాత పోరాడుతూ చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు మనసు మారకపోతే త‌మ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News