: జయ మెచ్చిన ఐదుగురు మహిళలు వీరే!
దివంగత ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత సాధించిన విజయాలు, స్త్రీగా ఆమె సాగించిన పోరాటాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అలాంటి యోధురాలు జయలలితకు ఐదుగురు మహిళలంటే అమితమైన ఇష్టం. తల్లి వేదవల్లి, నెచ్చెలి శశికళ, టీచర్ కేథరిన్ సైమన్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, దివంగత నటి మనోరమ అంటే జయకు చాలా ఇష్టం. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన జయకు ఆ తర్వాత అన్నీ తానై పెంచారు వేదవల్లి. ఆమె తల్లిగానే కాక జయకు మంచి స్నేహితురాలిగా కూడా వ్యవహరించారు. జయ ఒంటరి జీవితంలోకి అనూహ్యంగా వచ్చి, ఆ తర్వాత ఆమెకు సర్వస్వం అయ్యారు నెచ్చెలి శశికళ. జయ అంత్యక్రియలను సైతం నిర్వహించే స్థానంలో ఆమె నిలబడ్డారు. జయకు ఆంగ్ల భాషపై ఉన్న పట్టు, ప్రావీణ్యం అమోఘం. అంతేకాదు, పాఠశాలలో ఆమె మెరిట్ స్టూడెంట్ కూడా. ఆమెలోని ఈ సామర్థ్యానికి కారణం టీచర్ కేథరిన్ సైమన్. చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్ లో చదువుతున్నప్పుడు... జయపై కేథరీన్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 1984లో పార్లమెంటులో జయలలిత ప్రసంగం విన్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్ధురాలైపోయారు. ఈ ప్రసంగం ఇందిరకు జయను దగ్గర చేసింది. రాజకీయపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం కోసం ఇందిరకు జయ లేఖ రాస్తే... నమ్మకస్తులైన కొందరిని జయ వద్దకు పంపి సమస్యను పరిష్కరించారట ఇందిరాగాంధీ. యుగోస్లావియా దేశాధ్యక్షుడికి ఓసారి ఇందిరాగాంధీ విందును ఏర్పాటు చేసినప్పుడు... 16 మంది నేతలే ఆ విందుకు హాజరయ్యారు. అందులో జయ ఒకరు! దివంగత నటి మనోరమ అంటే జయలలితకు చాలా ఇష్టమట. సినిమాల్లో నటిస్తున్నప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వ్యక్తిగత కష్టాలను కూడా ఇద్దరూ పంచుకునేవారట. మనోరమ చనిపోయినప్పుడు చైన్నైకి దూరంగా సిరుదాపూర్ లో జయ ఉన్నారట. మనోరమ మరణవార్త విని, హుటాహుటిన చెన్నై వచ్చి ఆమెకు అంజలి ఘటించారట.