: నిన్న అశ్విన్ హవా, నేడు జడేజా దూకుడు... దిక్కుతోచని ఇంగ్లండ్ బ్యాట్స్ మన్!
టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తున్నారు. 'ఒకరోజు నువ్వు చూసుకో, మరోరోజు నేను చూసుకుంటా' అన్నట్టుగా నిన్న అశ్విన్ రాణించగా, నేడు జడేజా విజృంభించాడు. వీరి ధాటికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. 288/5 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టును జడేజా దెబ్బతీశాడు. స్టోక్స్ ను అశ్విన్ అవుట్ చేసి తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకోగా, వోక్స్, రషీద్ లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన జడేజా ఇంగ్లండ్ జట్టు స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించకుండా ముకుతాడు వేశాడు. ఈ క్రమంలో జడేజా మూడు వికెట్లు తీయడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టులో పెవిలియన్ చేరిన అందరు ఆటగాళ్లు వీరిద్దరి ఖాతాలో చేరడం విశేషం. మరోపక్క, సహచరులు వెనుదిరుగుతున్నా పట్టుదలగా ఆడుతున్న జోస్ బట్లర్ (64) అర్ధసెంచరీ సాధించాడు. అతనికి జతగా బాల్ (29) ఆడుతున్నాడు. దీంతో నాలుగో టెస్టు రెండో రోజు తొలి సెషన్ ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు 385/8 పరుగులు చేసింది.