: క్యాష్‌లెస్ సమాజం అంటే.. క్యాష్‌లెస్ ఏటీఎంలేనా?
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఊదరగొడుతున్న క్యాష్‌లెస్ సొసైటీ అంటే అర్థం ఏమిటి? సర్కారు చెబుతున్న అర్థం ఏమిటో కానీ.. దేశంలో క్యాష్‌లెస్ ఏటీఎంలు మాత్రం దర్శనమిస్తున్నాయి. దీంతో క్యాష్‌లెస్ సొసైటీ అంటే క్యాష్‌లెస్ ఏటీఎంలే అని పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. ఇందులో నిబంధనల సడలింపు నుంచి రాయితీల వరకు ఉన్నాయి. కాగా గురువారానికి నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నెలరోజులు అయింది. అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. బ్యాంకుల ముందు క్యూలు కానీ, ప్రజల ఇబ్బందుల్లో మార్పు కానీ ఇసుమంతైనా కనిపించలేదు. నోట్ల రద్దు తర్వాత దేశంలోని 2.2 లక్షలకుపైగా ఉన్న ఏటీఎంలలో 95 శాతం రీక్యాలిబరేషన్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిజానికి ఇది శుద్ధ అబద్ధమని తేలిపోయింది. ప్రముఖ దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెందిన జర్నలిస్టులు కొందరు గురువారం దేశవ్యాప్తంగా 13 నగరాల్లోని 647 ఏటీఎంలను సందర్శించారు. ఇందులో తేలిందేంటంటే.. వీటిలో 69.7 శాతం ఏటీఎంలు పూర్తిగా పనిచేయడం లేదని! దీంతో నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రభుత్వం సరైన ప్రణాళికలు రూపొందించలేదని తేలిపోయింది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తొలినుంచీ కొట్టి పడేస్తూ వస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఎక్కువ ఇక్కట్లకు గురవుతున్నది గ్రామీణ ప్రజలే. చాలా గ్రామాల్లో బ్యాంకులు లేకపోవడం, ఏటీఎంలు అందుబాటులో లేకపోవడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కాగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఏటీఎంలు దిష్టిబొమ్మలుగా మారాయి. ఇక పనిచేయని ఏటీఎంల విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 50 ఏటీఎంలలో 49 ఏటీఎంల వద్ద ‘నో క్యాష్’, ‘అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులే దర్శనమిస్తుండడం గమనార్హం. అయితే చిన్న నగరాలైన తిరువనంతపురం, భువనేశ్వర్‌లలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.