: నానక్ రామ్ గూడలో కూలిన కట్టడానికి తగిన అనుమతులు లేవు: బొంతు రామ్మోహన్
హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో పేకమేడలా కూలిన భవన శిథిలాల తొలగింపు కొనసాగుతోందని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ కట్టడానికి అనుమతులు లేవని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ కేవలం రెండు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తే... యజమాని దీనిని ఏడు అంతస్తుల నిర్మాణంగా చేపట్టాడని అన్నారు. అయితే ఇది శల్యపరీక్షకు సమయం కాదని, ముందు శిథిలాల తొలగింపు జరగాలని, ఆ పనులను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. శిథిలాలకింద సుమారు 13 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తోందని ఆయన చెప్పారు. శిథిలాలకింద చిక్కుకున్న తల్లీబిడ్డలను రక్షించామన్న ఆనందంలో ఉండగానే, ఒక వ్యక్తి మృతదేహం లభించడం బాధించిందని ఆయన చెప్పారు. బిల్డింగ్ యజమాని సత్తూ సింగ్ అలియాస్ సత్యనారాయణ చేసిన తప్పిదానికి అమాయకులు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.