: మ్యాచులే నిర్వహించలేకపోతున్నాం...ఇంక సూట్లెందుకు?: సీఈవోకు బీసీసీఐ సమాధానం
ప్రపంచంలోని క్రీడా బోర్డుల్లో బీసీసీఐ అత్యంత సుసంపన్నమైన క్రీడా బోర్డు అన్న విషయం తెలిసిందే. అందుకే, బీసీసీఐ దర్పాన్ని పెంచే విధంగా ఆటగాళ్లకు అత్యంత ఖరీదైన ఇటాలియన్ సూట్లు తెప్పించాలని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ప్రతిపాదించారు. ఒక్కోసూట్ విలువ 2.5 లక్షల రూపాయలు. అవి వేసుకుంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుందని ఆయన బీసీసీఐకి తెలిపారు. దీనిని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. బీసీసీఐది కార్పొరేట్ కల్చర్ కాదని ఆయన సీఈవోకు సూచించారు. ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మ్యాచ్ ల నిర్వహణే కష్టమవుతోందని, అంత ఖరీదైన సూట్లు తెప్పించుకునే అవకాశం లేదని ఆయన తన అశక్తతను వ్యక్తం చేశారు. జస్టిస్ లోథా కమీషన్ సూచనలు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఒత్తిడి, బీసీసీఐ దుబారాపై నిఘా ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కొత్త ఒప్పందాలు చేసుకోలేమని ఆయన రాహుల్ జోహ్రీకి తెలిపారు.