: ట్రంప్ ను టైమ్ మేగజీన్ అవమానించిందంటూ చర్చ
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మేగజీన్ అవమానించిందా? అంటే అమెరికన్లు అవుననే అంటున్నారు. ఈ ఏటి మేటి వ్యక్తిగా ట్రంప్ ను కీర్తించిన టైమ్ మేగజీన్ కవర్ ఫొటోపై ట్రంప్ ను అవమానించేలా ఆయన ఫోటోను డిజైన్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ట్రంప్ ఫోటోను టైమ్ మేగజీన్ ఉద్దేశపూర్వకంగా హిట్లర్ ఫొటోలా తీర్చిదిద్దిందని ఓ నెటిజన్ రెండు ఫోటోలు ట్వీట్ చేశాడు. దీంతో మరో వ్యక్తి టైమ్ పేరులోని ‘ఎం’ అక్షరం మధ్యలో ట్రంప్ తల రావడంతో ఎం అక్షరం ఆయనకు కొమ్ములు వచ్చినట్లుగా చూపిస్తోందని పేర్కొంటూ కేవలం ట్రంప్ ను అవమానించేందుకే టైమ్ ఈ పురస్కారం ప్రకటించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా ‘విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు’ అని అభివర్ణిస్తూ కవర్ ఫొటోను టైమ్ ప్రచురించడంతో టైమ్ మేగజీన్ నిజంగానే ట్రంప్ ను అవమానించేందుకే ఇలా చేసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రంప్ మద్దతుదారులు టైమ్ మేగజీన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టైమ్ పురస్కారంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.