: రతన్ టాటా లేఖపై ఘాటుగా స్పందించిన మిస్త్రీ
టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా రాసిన లేఖపై సైరస్ మిస్త్రీ కార్యాలయం ఘాటుగా స్పందించింది. ఆ లేఖలో రాసిన విషయాలన్నీ అబద్ధమని ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సైరస్ మిస్త్రీని తొలగించడానికి కేవలం ఐదు నిమిషాల ముందు మాత్రమే ఆ విషయం ఆయనకు తెలుసునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మిస్త్రీని పదవి నుంచి తొలగించిన రోజున బోర్డు సమావేశానికి ఐదు నిమిషాల ముందు టాటా, నితిన్ నోహ్రియా మిస్త్రీ రూమ్ కు వచ్చి ఉన్నపళంగా ఆయన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు’ అని మిస్త్రీ కార్యాలయం విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, షేర్ హోల్డర్ల మద్దతు కోరుతూ రతన్ టాటా నిన్న వారికి లేఖ రాశారు. పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగే అవకాశం ఇచ్చినా ఆయన తిరస్కరించారని, అందుకే, మిస్త్రీని తొలగించాల్సి వచ్చిందని ఆ లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు.