: మా నాన్న అన్న ఆ ఒక్క మాటతో 160 కేజీల బరువు తగ్గాను!: అద్నాన్ సమీ
తన తండ్రి చెప్పిన ఒక్క మాటతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ సినీ గాయకుడు అద్నాన్ సమీ తెలిపారు. పాకిస్థాన్ లో పుట్టిన అద్నాన్ భారతీయ పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే. ముంబైలో సమీ మాట్లాడుతూ, 2006కి ముందు తాను ఎలా ఉండేవాడినో అందరికీ తెలిసిందేనని అన్నాడు. అప్పట్లో ఆయన 230 కేజీల బరువుండేవారు. 1989లో తన నాన్నకు క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని ఆయన తెలిపారు. ఆయన దానికి చికిత్స తీసుకుంటూ 2009లో మరణించారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు హెల్త్ చెకప్ చేయించేందుకు ఓసారి పాకిస్థాన్ నుంచి లండన్ వెళ్లామని గుర్తు చేసుకున్నారు. ఆయనకు పరీక్షలయ్యాక తాను కూడా పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. తనను పరీక్షించిన డాక్టర్ అధిక బరువు వల్ల ఎక్కువ రోజులు బతకడం కష్టమని తన తండ్రి ముందే చెప్పారని అన్నారు. దీంతో దిగులుపడ్డ తన తండ్రి 'నా కళ్ల ముందు నువ్వు చనిపోకూడద'ని అన్నారని ఆయన చెప్పారు. ఆ రోజు తన తండ్రి అన్న ఆ మాట తనపై చాలా ప్రభావం చూపిందని అన్నారు. తన తండ్రి కోరుకున్నట్టు జరగాలంటే బరువు తగ్గడమే మార్గమని భావించి, బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. దీంతో తీవ్రంగా శ్రమించి, సహజసిద్ధంగా ఆరేళ్లలో 160 కిలోల బరువు తగ్గానని ఆయన తెలిపారు. ఈ రోజు తనను ఇలా చూసి చాలా మంది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారని ఆయన చెప్పారు. సాధించాలని ఉంటే అసాధ్యమైనదేదీ లేదని ఆయన తెలిపారు.