: పాకిస్థాన్ కు వరల్డ్ బ్యాంక్ షాక్.. రూ. 630 కోట్ల రుణం నిలిపివేత!
పాకిస్థాన్ కు వరల్డ్ బ్యాంక్ షాకిచ్చిందని డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్ లోని సహజవాయువు (నాచురల్ గ్యాస్) ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన 630 కోట్ల రూపాయల (100 మిలియన్ డాలర్ల) రుణాన్ని మంజూరు చేయడానికి వరల్డ్ బ్యాంక్ నిరాకరించిందని 'డాన్' వెల్లడించింది. కరాచీ, సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో సహజ వాయువు సరఫరాను మెరుగుపరిచేందుకు, గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థలో వాణిజ్య, ఇతర లొసుగులను అధిగమించేందుకు సుయ్ సదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్జీసీ) ఈ ప్రాజెక్టు చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలం కావడం, ఇంతవరకు చేసిన పనుల్లో నాణ్యత లేకపోవడం, పనులు పూర్తి చేసేందుకు కంపెనీ పెద్దగా ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో వరల్డ్ బ్యాంక్ రుణం మంజూరు చేసేందుకు సిధ్ధంగా లేదని తెలిపింది. అంతే కాకుండా ఇంత వరకు చేసిన పనుల్లో అక్రమ గ్యాస్ లీకేజీలు అధికంగా కొనసాగుతూ విలువైన సహజ వనరు దుర్వినియోగం కావడం పట్ల ప్రపంచ బ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసిందని డాన్ తెలిపింది. దీంతో రుణం ఇచ్చేందుకు నిరాకరించిందని వెల్లడించింది.