: లక్ష్మణరావు రూ. 10 వేల కోట్ల 'బ్లాక్ మనీ' కథ ఇదీ!
లక్ష్మణరావు... స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని కేంద్రం ప్రకటించిన వేళ, రూ. 10 వేల కోట్ల బ్లాక్ మనీ తన దగ్గర ఉందని చెప్పిన హైదరాబాద్ వ్యక్తి. ఇక అతని వద్ద అంత డబ్బు లేదని తెలుసుకున్న తరువాత ఆదాయపు పన్ను అధికారులు కేసు పెట్టగా, ఇలా లేని డబ్బు చెప్పడానికి గల కారణాన్ని ఆయన నోటి నుంచి విన్న పోలీసులు నివ్వెరపోయారు. ఓ మధ్యవర్తి చెప్పిన మాయ మాటలు నమ్మి, డబ్బును రెట్టింపు చేసే యంత్రాలున్నాయని నమ్మి, దాన్ని సొంతం చేసుకుని, ఆపై విక్రయించి వచ్చే డబ్బును వైట్ మనీగా చేసుకోవాలన్నదే లక్ష్మణరావు అసలు ఉద్దేశమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇంకాస్త వివరాల్లోకి వెళితే, తనకు పరిచయమున్న ఓ వ్యక్తి, బార్కస్ లో ఉన్న బాబాకు అద్భుత మంత్ర విద్యలు తెలుసునని, అతని వద్ద డబ్బును రెట్టింపు చేసే యంత్రం ఉందని చెబితే గుడ్డిగా నమ్మేశాడు. యంత్రాన్ని పరీక్షించాలని లక్ష్మణరావు కోరగా, దాన్ని చూపిన బార్కస్ బాబా, తన టక్కు టమార విద్యతో కొన్ని నోట్లను రెట్టింపు చేశాడు. దీంతో అతని మాయలో పడిపోయాడు లక్ష్మణరావు. ఇక ఇదే యంత్రాన్ని మనం కొనుక్కోని రూ. 10 వేల కోట్లకు ముంబైలో విక్రయించ వచ్చని మధ్యవర్తి చెబితే నమ్మాడు. ఇదే సమయంలో మోదీ సర్కారు ఐడీఎస్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. యంత్రాన్ని తన సొంతం చేసుకుని, ఆపై దాన్ని విక్రయిస్తే, వచ్చే డబ్బును వైట్ మనీ చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే లక్ష్మణరావు తన వద్ద రూ. 10 వేల కోట్ల బ్లాన్ మనీ ఉందని ప్రకటించేశాడు. ఇదీ లక్ష్మణరావు బ్లాక్ మనీ వెనకున్న కథ. ఇప్పుడు అతనిపై క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం బార్కస్ బాబా, సదరు మధ్యవర్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.