: నేను చెప్పాను, సచిన్ చేశాడు... ఆ పాపం నాదే: సెహ్వాగ్
సచిన్ టెండూల్కర్... తన టెస్టు క్రికెట్ జీవితంలో ఓకే ఒక్కసారి స్టంపౌట్ అయ్యాడు. 2001లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆష్లే గైల్స్ వేసిన బంతిని ఆడేందుకు ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. ఇక ఆనాటి సచిన్ అవుట్ కు తనదే బాధ్యతని, తాను చెప్పిన మాటలు విని, సచిన్ వాటిని పాటించి అవుట్ అయ్యాడని, ఆ పాపం తనదేనని చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. "ఆష్లే గైల్స్ సచిన్ కు బౌలింగ్ చేసేటప్పుడు లెగ్ సైడ్ వికెట్ కు దూరంగా బంతులేస్తూ, సచిన్ ను ఇబ్బంది పెడుతున్నాడు. నేను సులభంగా ఆడుతుంటే, సచిన్ ప్యాడ్లు అడ్డుపెడుతూ, ఇబ్బందులు పడుతున్నాడు. ఆ సమయంలో సచిన్ దగ్గరికెళ్లి బంతి స్పిన్ కావడం లేదని, ముందుకొచ్చి షాట్లు ఆడమని చెప్పాను. ఐతే దురదృష్టం.. సచిన్ ముందుకొచ్చిన బంతే స్పిన్ అయింది. సచిన్ తొలిసారి స్టంపౌట్ అయ్యాడు. ఆరోజు నేను డ్రెస్సింగ్ రూంకే వెళ్లలేదు. అంపైర్ల గదిలోనే ఉన్న నాకు సచిన్ నుంచి పిలుపొచ్చింది. టెస్టుల్లో తొలిసారి స్టంపౌట్ అయ్యానని, అందుకు కారణం నేనేనని సచిన్ చెప్పాడు" అని సెహ్వాగ్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.