: మహారాష్ట్రలో కొండను అధిరోహించబోయి.. హైదరాబాద్‌ పర్వతారోహకురాలి మృత్యువాత


హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకురాలు రచిత మహారాష్ట్రలో మృత్యవాత పడ్డారు. నగరంలోని హైదర్‌గూడ అవంతినగర్‌లో నివసించే రచిత గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని నవంబరు 29న ఆమె మామ మహేశ్ గుప్తా కనోడియా, తిరుమలగిరిలో నివసించే ఆమె తండ్రి సజ్జన్ గుప్తాలు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి కథనం ప్రకారం.. రచిత గత నెల 25న హైదరాబాద్ నుంచి పన్వేల్ చేరుకున్నారు. 29న కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. దుబాయ్‌లో ఉన్న భర్తకు మహారాష్ట్రలోని ప్రబల్‌గఢ్ కొండ చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపారు. సాహసాలంటే ప్రాణంపెట్టే ఆమె జాడ రోజులు గడుస్తున్నా తెలియకపోవడంతో ముంబై పోలీసుల సాయంతో కుటుంబ సభ్యులు, నారాయణగూడ పోలీసులు గాలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాయ్‌గఢ్ వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమె ప్రబల్‌గడ్ పరిసరాల్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల తర్వాత ఆమె ప్రబల్‌గఢ్ కొండ దిగువన శవమై కనిపించారు. రచిత గతంలో ఇదే కొండను అధిరోహకుల బృందంతో కలిసి కొంతవరకు అధిరోహించారు. ఈసారి ఒంటరిగా ఎక్కే ప్రయత్నంలో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News