: పోలవరం పూర్తయిందా.. ఇక జగన్ పని గోవిందా!: చంద్రబాబు సెటైర్
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పని ఇక అంతేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పోలవరం నిర్మాణాన్ని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోకుంటే తనకిక భవిష్యత్తు ఉండదన్న భావనతోనే ఆయన ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. పోలవరం వెళ్లి అక్కడి గిరిజనులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నుంచి పరిశ్రమల వరకు అన్నింటినీ అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం రూ.28 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ విషయం జగన్‌కూ తెలుసని, అయినా ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు తీసుకోవద్దని అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని జగన్ ఊదరగొడతారని, వచ్చిన పరిశ్రమలు, పోర్టులను మాత్రం అడ్డుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. చరిత్రలోనూ రాక్షసులు ఉన్నారని, మంచి కోసం యజ్ఞాలు చేస్తుంటే అడ్డుకున్నారంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.