: బాపట్ల ఎంపీపీ మానం విజేతకు గుండెపోటు... పదవీ వివాదమే కారణం?


గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీపీ మానం విజేత గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. కాగా, ఓ వివాదం కారణంగా ఆమెకు గుండెపోటు రావడం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే... బాపట్ల టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ పదవి రెండు వర్గాలకు అందేలా, వర్గపోరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలను చెరి రెండున్నరేళ్లపాటు పదవిలో ఉండేలా పార్టీ జిల్లా నేతలు ఒప్పించారు. ఈ మేరకు ఇద్దరు నేతలతో సంతకాలు చేయించుకుని ఒప్పందం కూడా చేశారు. అయితే మొదటి విడత ఎంపీపీగా మానం విజేత ఉన్నారు. ఆమె రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో రెండో వ్యక్తికి తన పదవి అప్పగించాల్సి వచ్చింది. దీంతో ఆమెను తప్పుకోవాలని నియోజకవర్గ ఇన్‌ చార్జ్ అన్నం సతీష్ ఆదేశించారు. దీంతో అసలు ఒప్పందమే జరగలేదని, అలాంటప్పుడు పదవినుంచి తప్పుకోవడమెందుకని చెబుతూ తాను పదవి నుంచి తప్పుకోనని విజేత చెప్పారు. దీంతో ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని పేర్కొంటూ మరో వర్గం ఒత్తిడి పెంచడంతో ఆమె గుండెపోటు బారిన పడ్డారు. దీంతో ఆమెను బాపట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News