: పారిస్ లోని మ్యూజియంలో రణ్ వీర్ సింగ్ మైనపు విగ్రహం
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ మైనపు విగ్రహాన్ని పారిస్ లోని మ్యూజియంలో పెట్టనున్నట్టు తెలుస్తోంది. రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ జంటగా నటించిన ‘బేఫిక్రే’ సినిమా షూటింగ్ లో సింహభాగం పారిస్ లో జరిగింది. ఈ షూటింగ్ లో పారిస్ లోని ప్రముఖ కట్టడాలు, చారిత్రక వంతెనల వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పారిస్ లోని గ్రెవిన్ వ్యాక్స్ మ్యూజియంలో రణ్ వీర్ సింగ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మ్యూజియం అధికారులు రణ్ వీర్ సింగ్ ఫొటోలు, కొలతలు తీసుకుంటుండగా తీసిన ఫొటోలను ఆయన అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో మ్యూజియంలో మైనపు విగ్రహాలు పెట్టిన ప్రముఖుల జాబితాలో రణ్ వీర్ సింగ్ కూడా చేరనున్నారు. ఎల్లుండి విడుదల కానున్న 'బేఫిక్రే' సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా హాట్ ముద్దు సీన్లతో కావాల్సినంత ప్రచారం సంపాదించుకుంది.