: మా అత్తకు శశికళ అంత్యక్రియలు నిర్వహించడం బాధించింది: జయలలిత మేనకోడలు
తన అత్తకు శశికళ అంత్యక్రియలు నిర్వహించడం తనను బాధించిందని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం ఇంతవరకు చూడలేదని అన్నారు. తన అత్త మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలు దాగున్నాయని ఆమె చెప్పారు. త్వరలోనే వాటన్నింటినీ తాను బయటపెడతానని ఆమె చెప్పారు. కాగా, జయలలిత సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె దీప. వారు కొంత కాలం పోయేస్ గార్డెన్ లోనే ఉండేవారు. అయితే జయలలితతో విభేదాలు రావడంతో చెన్నైలోని టీనగర్ లో కాపురం పెట్టారు. అయితే, దీప పోయెస్ గార్డెన్ లో ఉండగానే జన్మించింది. గతంలో పోయెస్ గార్డెన్ లో జయలలితను కలిసేందుకు వెళ్లగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో తన నాయనమ్మ (జయలలిత తల్లి సంధ్య) తనకు ఆ ఇంటిని రాసిచ్చారని, అందుకు సంబంధించిన దస్తావేజులు కూడా తన వద్ద ఉన్నాయని, తన తాను ఇంట్లోకి వెళ్లేందుకు తనకు పర్మిషన్ ఏంటని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తరువాత జయలలిత దర్శనం కోసం అక్కడ వారం రోజులపాటు నిరీక్షించినా ఉపయోగం లేకపోయింది. తాజాగా ఆమె మరోసారి తెరపైకి రావడంతో తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.