: బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన.. అదుపు చేయలేక మూడుసార్లు గాల్లోకి కాల్పులు
పంజాబ్‌లోని బుద్‌లాడా పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవడానికి ఖాతాదారులు బారులు తీరారు. అయితే, గంటల తరబడి క్యూలైన్లలోనే ఉండిపోయి తీవ్ర అసహనానికి గురయ్యారు. బ్యాంకు ముందు గందరగోళం చేసి ఆ మార్గం గుండా వాహనాలను వెళ్లనివ్వలేదు. దీంతో బ్యాంకు గార్డు ఒక్కసారిగా గాల్లోకి మూడు సార్లు కాల్పులు జరపడంతో ఆందోళనకు గురై పరుగులు తీశారు. గార్డు కాల్పులు జరపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా బుల్లెట్ తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని, గార్డుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.